BHAGAVATA KADHA-3    Chapters   

ధర్మరాజుకు కనఁబడిన అపశకునములు

48

శ్లో || ఇమే జనపదా గ్రామాః పురోద్యానా కరాశ్రమాః |

భ్రష్టశ్రియో నిరానందాః కిమఘం దర్శయంతి నః ||

---భాగ . 1 స్కం.14 అ.20 శ్లో.

" భీమసేనా ! యీసమస్త దేశము, గ్రామ, పురోద్యానములు, ధాతునిలయములు, ఋష్యాశ్రమములు శ్రీహీనములై, ఆనంద రహితములై యున్నవి. ఇట్టి యపశకునములు కనఁబడుచున్నవి. ఇవి దారుణ దుఃఖ వార్తను వినవలసి యున్నదని సూచించుచున్నట్లున్నది."

ఛ ప్ప య.

ఫరకే బా ఈఁ బాహు హృదయ మేఁ కంపన హోవే |

కరిముఁహ మేరీ ఓర శ్వాస నిర్భయ హ్వై రోవే||

ఉల్లూ ఔర కపోత మృత్యు కే దూత కహావేఁ |

కర్కశ కఠిన కరాల, శబ్ద కరి హృదయ హిలావేఁ ||

లీలా విగ్రహ ద్యాగి కా, శ్యామ ధామ గమనే కహిఁ |

కరూఁ కహా చిత దుఖిత అతి అరజున హూ ఆయో నహిఁ ||

అర్థము

ధర్మరాజిట్లనుకొనెను :- నా వామాంగము లదరుచున్నవి. వామ బాహు వదరినది. హృదయము కంపించు చున్నది. కుక్క నాముఖమై నిర్భయముగ నేడ్చుచున్నది. మృత్యుదూత లనఁబడు గుడ్లగూబలు, కపోతములు కర్కశ కఠిన కరాళ శబ్దములను గావించి హృదయమును గదలించుచున్నవి.

శ్యామసుందరుఁడు తన లీలావిగ్రహమును వదలి స్వధామమును జేరెనేమో! అర్జునుఁడింకను రాలేదు. చిత్తము దుఃఖించుచున్నది. ఏమిచేయుదును?"

----

రాఁబోవు విషయము సూచన ముందుగానే తెలియుచుండును. చలికాలము తర్వాత ఎండకాలము వెంటనేరాదు. మొట్టమొదట వణఁకు పుట్టునంత చలిగా నున్నది క్రమక్రమముగాఁ బన్నీరు జల్లువలె మంచు పడుచు పగట కొంచెము ఉష్ణముగ నుండును. దీనిని బట్టి ప్రజలు చలికాలము పోయి యెండాకాలము వచ్చుచున్నదని గ్రహించెదరు. ఇదేవిధముగా వర్షకాలము తర్వాత మొదట కొంచెము చలిచలిగఁ దోఁచు చుండును. ఇది వఱకు సహింపరాని తీక్షపుటెండ యిప్పుడు కొంచెము హాయిగనుండును. దీనినిబట్టి చలికాలము రానున్న దని ప్రజలు గ్రహింపగలరు. ఈ విధముగనే శుభాశుభ శకునముల వలన జరుగఁబోవు శుభాశుభములను గనుఁగొన వచ్చును. శుభములు జరుగవలసి యుండిన శుభశకునములు కలుగును. అశుభములు జరుగవలసియుండిన అశుభశకునములు కలుగును. అవిశ్వాసమువలన నేఁటివా రీ శకునముల మీఁద లక్ష్యముంచరు. పూర్వము శకునములను గాంచియే సర్వకార్యములు జరుగు చుండెడివి. లక్ష్య పెట్టకున్నను అశుభశకునములు అశుభఫలముల నిచ్చితీరును.

ధర్మరాజు యీవిధముగా దుఃఖితుఁడై, చింతించుచు, విలపించుచుండుటను గాంచి భీమసేనుఁ డిట్లడిగెను :- " రాజా ! మీరేయే యపశకునములను గాంచి యిట్లు చింతించుచున్నారు ? మన మీఁద దండెత్తుటకు మనకు శత్రువులెవరునులేరే. చుట్టాలు పక్కాలంద ఱిదివఱకే నశించిరి. ఇఁక నున్నది మనమన్నదమ్ములమే. మనకైనను నింకెన్నో దినములు బ్రతుకవలెనని లేదు. అట్టియెడ మీరింతగాఁ జింతింపనేల?"

ధర్మరాజిట్లనెను :- " భీమసేనా ! నాకు శత్రుచింత అణుమాత్రమైన లేదు. ఒక్క బాణముచేఁ ద్రిలోకములను భస్మము చేయఁగలిగిన భీష్మ, ద్రోణ, కర్ణాదులను మహాయోధులను జయింపఁగా నింకే శత్రువు మన కనిష్టము చేయఁగలుగును ? నాకు మీ నల్గురు తమ్ముల అండ కలదు. నాకు నా శరీరచింతయు లేదు. అది యేదియో యొక దినమునఁ జావనే చచ్చును. కాని నాచింత వేఱు. అది ఒక్క విషయమునఁ గలదు. తమ్ముఁడగు నర్జునుని నేను ద్వారకకుఁ బంపితిని. పంపిన కారణము కూడ పుణ్య శ్లోకుఁడగు వాసుదేవుఁడు ముందేమి చేయునున్నాఁడో కనుఁగొని రమ్మనియే. ఆతఁడు వెళ్లి ఏడవమాసము దాఁటిపోయినది. ఆతఁడింకను రాను రాలేదు. తనసంగతి దూతద్వారానైన కబురు చేయలేదు. ఈవిషయము ననే నాకు మాటి మాటికి సందేహము కలుగుచున్నది. దేవర్షియగు నారదుఁడు భగవంతుఁడు తన నరలీలను ఉపసంహరింపఁ బోవుచున్నాఁడని నాతో నిప్పుడే చెప్పిపోయినాఁడు. అట్టిస్థితిని మనము కన్నులారఁ జూడరాదు. మన మీ భూమిపై నుండఁగనే యాత్రైలోక్య సుందరవిగ్రహుడగు దేవకీనందనుఁడు తన యనుపమ లీలావిగ్రహమును వదలి స్వధామమునకు వెడలిన నాదుఃఖవార్తను విన నేను సిద్ధముగలేను. ఇది మనము సహింపరాని దుఃఖము. మన యీ శరీరములనుండి ఉశ్శ్వాస నిశ్శ్వాస రూపమున వెడలు చుండు నీప్రాణము నిజమగు ప్రాణముకాదు. మనకా వాసుదేవుఁడే ప్రాణము. మనకు లభించిన ధనము , రాజ్యము , ఐశ్వర్యవృద్ధి, కులప్రేమ, ప్రజాప్రేమ, శత్రువిజయము, యజ్ఞ యాగాది క్రతునిర్వహణమువలన ఇహపరలోకప్రాప్తి ఇవన్నియు నాతని కృపవలననే లభించినవి. ఆతఁడు లేకపోయిన మనమేమిచేయఁగలిగెడు వారము? ఆతని సహాయము, సమ్మతి, కృపానుగ్రహాదులు లేకున్న మనమీదశలో నుండఁగలిగెడివారమేనా ? ఆతఁడు మనలను వదలి వెళ్లిపోవునేమోనని నాకు రోజుకు నాలుగు సారులు మనస్సుకు వచ్చుచుండును. అట్లు వచ్చినప్పుడు నాహృదయము చాల వ్యధ చెందుచుండును. ఒకటికాదు, రెండుకాదు అనేకములగు నాధ్యాత్మిక, అధిదైవిక, అధిభౌతిక అపశకునములు నాకుఁ దోఁచు చున్నవి."

భీమసేనుఁ డిట్లనెను :- " దేవా ! మీ కే యపశకునములు గోచరించుచున్నవో తెలుపుఁడు. వినఁగోరుచున్నాను."

ధర్మరాజిట్లనెను :- " పురుషులకు వామాంగములు అనఁగా కన్ను, భుజము, జంఘ మొదలగునవి అదురుట అశుభము. స్త్రీలకు కుడి యవయవయము లదరుట అశుభము. పురుషునకు ఎడమ కన్నుపై ఱప్ప, కనుబొమ్మ అదరుట అశుభ##మే కాని క్రింది ఱప్ప, బుగ్గకు పైభాగము అదరిన మిక్కిలి అశుభము, నాకిక్కడే మాటిమాటికి అదురుచున్నది."

భీమసేనుఁడిట్లనెను :- " రాజా ! కన్నదరిన ప్రజలు సాధారణముగ దానిమీఁద కొంచెముగ నుమ్మివైచి రాఁచెదరు. అప్పుడది అదరదు. దానివలన ననిష్టము శాంతించునందురు."

ధర్మరాజిట్లనెను :- " నే నన్నియు ఁ జేసిచూచితిని. కన్నదరుట ఆఁగలేదు. ఇంతేకాదు. హృదయముకూడ అకారణముగ నదురుచున్నది. మనస్సేలకో తికమక చెందుచున్నది ?"

భీమసేనుఁడిట్లనెను :- " ప్రభూ ! ఒక్కొక్కప్పుడు మనోవిభ్రమము కలిగిన ఇట్లే యుండును. అర్జునుఁడు రాకపోవుటచే మీకిట్టి యనుమానము కలుగుచున్నది. ఆకారణముననే మీ చిత్తము చంచలమైనది. మీ రా ఆనుమానిక శంకను వీడుఁడు. మంగళమయుఁడగు మాధవుడు మీకు సర్వ శుభములు చేకూర్పఁగలఁడు."

ధర్మరాజిట్లనెను :- " భీమా! సరియే నీవు చెప్పినట్లే అగునెడల నేనొప్పుకొనుటకు సిద్ధముగ నున్నాను; కాని నాశరీరములోనే కాదు బాహ్యమందును నిట్టి యపశకునములు కనఁబడుచున్నవేమి ? నక్కలు రాత్రులందే సాధారణముగ నఱచుచుండును. కాని ఆఁడు నక్కలు తెల్లవారిన తర్వాత సూర్యుని జూచి అఱచుచున్నవి. కుక్కలు నావైపు మోరలెత్తుకొని నిర్భయముగ మొఱఁగుచున్నవి. ఎవరి ముఖము చూచి కుక్క ఏడ్చును అఱచునో వానికేదియో గొప్పయనిష్టము కలుగునని గ్రహింపవలెను."

" శాస్త్ర మేమనఁగా - గోవు కుడిప్రక్కగాఁ బోవల యును. కుక్క, నక్క, గాడిదె, పంది మొదలగునవి ఎడమ వైపుగాఁ బోవలయును. కాని ఎంతప్రయత్నము చేసినప్పటికిని గోవు కుడిప్రక్కగాఁ బోవుటలేదు. ఎడమవైపుగానే పోవుచున్నది. ఇదిగాక విపరీతముగ నింద్యపశువులు కుడిప్రక్కగా నిర్భయముగఁ బోవుచున్నవి."

భీమసేనుఁడిట్లనెను :- " రాజా! దైవ వశమున నిట్లై యుండవచ్చును. ఆటవిక జంతువుల కింతటి జ్ఞాన మెచ్చటిది?"

ధర్మరా జిట్లనెను :- " అట్లు కాదు. మన అశ్వశాల లోని అశ్వముల కెవరు నేర్పిరి ? నేను మన సహదేవునిద్వారా వాటిని గూర్చి చాల పరామరిక చేయించుచున్నాను. కాని అవి కన్నులనుండి నీరుగార్చుచు నేడ్చుచున్నవి. మృత్యుదూతలగు కపోతములు, గుడ్లగూబలు రాత్రియంతయు నాభవనముపైఁ గూర్చుండి కఠోరశబ్దములు చేయుచుండును. దీనినిఁబట్టి విశ్వప్రళయము కలుగునేమోనని తోఁచుచున్నది. దిక్కులంధకార మయములై యున్నవి. అవియన్నియు ధూమ్రమయములుగ నున్నవి. చుక్కలు రాలుచున్నవి. సూర్య చంద్రమండలముల చుట్టును మండలములు కనఁబడుచున్నవి. భూమి మాటిమాటికి కంపించుచున్నది. పర్వతములు భూమిలో దిగపడి పోవుచున్నవి. అప్పుడప్పుడు అక్కడక్కడ భూమిలోనుండి అగ్ని యుప్పతిల్లుచున్నది. ఆసమయములో నురుములు ఉరుముచున్నవి. మేఘములు భీభత్సదృశ్యముతోఁ గనఁబడుచున్నవి. రాజ్యములో నచ్చటచ్చట రక్తవర్షము కురియుచున్నదని ప్రజలు చెప్పుచున్నారు."

భీమసేనుఁడిట్లనెను :- " రక్తవర్ష మెట్లు కురియును ?"

ధర్మరాజిట్లనెను :- " నీటివర్షము కురిసినట్లే రక్తవర్షము కూడ ఆకాశమునుండి కురియును. ఇంటికప్పులపై రక్తము పేరుకొనును. పృథ్వి రక్తరంజితమగును. ఇట్టి వర్షమును నేను స్వయముగఁ బోయి చూచితిని.

ఇంతేకాదు. ఆకాశమున నింక ననేకోత్పాతములు కలుగుచున్నవి. గృహములు కదలుచు నొకటొకటి డీకొనుచున్నవి. పగటనే భూతప్రేతాదులు నృత్యము చేయుచుఁ గనఁబడుచున్నవి. భూమిలోపలనుండి మంటలు రేగుచున్నవి. నద, నదీ, సరోవర, తటాకాది జలాశయములలోని నీరు కలత చెందుచున్నది. జనులందఱ మనస్సులలో నేదియో భయము కలుగు చున్నది."

భీమసేనుఁ డిట్లనెను :- " ఇట్టివి జరుగుచున్నవని మీ కెవరైనఁ జెప్పినారా ? లేక మీరు స్వయముగ నీలక్షణములను గాంచినారా ?"

ధర్మరాజిట్లనెను :- " కొన్ని విషయములు విశ్వసింపఁ దగినవారు చెప్పిరి. కొన్నిటిని నేను స్వయముగఁ గాంచితిని.

నేను సాయంకాలము, ప్రాతఃకాలము నిత్యము అగ్ని హోత్రము చేయఁబోవుదును. హోమాగ్ని ఎంత ప్రయత్నించినను బ్రజ్వరిల్లదు. మాటిమాటికి విసరి ఘృతాహుతులను వేయుచునే యుందును. దానినుండి పొగ వచ్చును గాని మంట రాదు. ఒక దినమునఁగాదు. చాల దినములనుండి యిట్లు జరుగుచునే యున్నది. దీనినిఁబట్టి యీ కుటిల కరాళ కాలమేమి చేయనున్నదో యని నాకు సందేహము కలుగుచున్నది.

అశ్వశాలలోని యశ్వము లేడ్చుటయే కాదు, గోశాలలోని గోవులుకూడ అట్లే యేడ్చుచున్నవి. దూడలను పాలకు వదలిన నవి పాలను ద్రాఁగవు. గోవులు పాలీయవు. ఎద్దులు కూడ మొద్దులవలె మందమతిగా నున్నవి. వాటికి గడ్డి, గాదము వేసిన ముట్టవు. కారణమేమియో తెలియదు. వాటికేమి రోగశోకములు కలిగినవో ? ఒక్కసారిగా నిట్టిస్థితి యేలకలిగినది ?

ఇదంతయు మానవ, పశు పక్ష్యాదుల విషయము. ఇంక నాశ్చర్యకర విషయములు కలవు. దేవతామూర్తులు కన్నుల నుండి నీరు కార్చుచున్నవి. వాటి శరీరమునుండి చెమట వచ్చుచున్నది. అవి యేడ్చుచున్నట్లు కనఁబడుచున్నవి. అవి బ్రదికి యున్న ప్రాణులవలెఁ జైతన్యముగ నున్నవి. ఇవికాక యింక ననేకోత్పాదములు కనఁబడుచున్నవి. ధన ధాన్యాదు లన్నియుఁ బూర్వరీతినే యున్నప్పటికి దేశ, గ్రామ , పుర, పుష్పోద్యానాదులు, ఋష్యాశ్రమములుశూన్యములై శ్రీహీనములై కనఁబడుచున్నవి. ఈ యుత్పాతములవలనను, అర్జునుఁడింకను రాకపోవుట చేతను, భగవంతుని వజ్రాంకుశ ధ్వజారవింద చిహ్న చిహ్నిత శ్రీపాదస్పర్శచే సౌభాగ్యశాలినియైన నీపృథ్వి అభాగిని కాలేదు కదా యని మాటిమాటికి చింతించుచుందును. వాసుదేవ భగవానుఁడీ ధరాధామమును వదలిపోలేదు గదా ?"

ధర్మరాజుని మాటలను విని భీమసేనుఁడిట్లనెను :- " దేవా ! ఇవి వాస్తవముగ ననిష్టకరములగు అపశకునములే. ఇప్పుడు మనమేమి చేయవలయునో యేమియుఁ దోఁచుటలేదు. మీరాజ్జ యొసంగిన నేను ద్వారకాపురికి పోయి సమస్త సమాచారమును గొనివచ్చెదను." ఇది విని ధర్మరాజు చింతాకుల మనస్కుఁడై తర్వాత నేమి చేయవలయునో తెలియక కూర్చుండి చింతించుచుండెను.

ఛప్పయ

గాయేఁరోవోఁ నిత్య, ఘాస ఘోడే ఘోడే నహి ఖావేఁ |

బహే వాయు భీభత్స, రక్త బాదల బరసావేఁ||

పృథ్వీ , ప్రేత పిశాచ, పాపియోఁతే పరిపూరన|

భఈ గఈ శుభకాంతి, లడే నభ మేఁ సబ గ్రహగన||

దేవమూర్తి ముఖ మలిన కరి అశ్రు బిందు బరసావతీఁ |

అతి అపశకున జనావతీఁ , దుఃఖద దృశ్య దిఖలావతీఁ ||

అర్థము

ధర్మరాజు భీమునిబిలిచి యిట్లనెను :- " భీమన్నా ! మన గోష్టములోని గోవులు కంట నీరుగార్చి యేడ్చుచున్నవి. గుఱ్ఱములు గడ్డిమేయవు. వాయువు భీభత్సముగ వీచుచున్నది. మేఘములు రక్తమును వర్షించుచున్నవి. ఇఁక భూమియా, భూతప్రేత పిశాచములతోడను, పాపులతోడను నిండిపోయినది. శుభకాంతి తొలఁగి పోయినది. ఆకాశమున గ్రహగణము లన్నియుఁ బరస్పరము పోరాడుచున్నవి.

దేవతా విగ్రహములు ముఖములు మలినములుకావించి కన్నులనుండి యశ్రుబిందువులను గార్చుచున్నవి. అనేక అపశకునములును, అనేక దుఃఖద దృశ్యములును గనఁబడుచున్నవి."

BHAGAVATA KADHA-3    Chapters